చిన్నప్పుడు మా సంస్కృతం మాస్టారు గురువు అంటే బరువు అని అర్థం చెబితే నా అజ్ఞానపు మేథస్సుకి ఏ అనుమానం రాలేదు....గురువుకు నేను బరువా? నాకు గురువు బరువా?
ఈ ఆలోచన వైపు దృష్టి సారింప చేసిన వారి అనుగ్రహపు బరువే ఈ పలుకులు చిలికిస్తోంది...
గురు పాదాలు చేరాలని తపించాలనే తృష్ణ లేదు
ఆర్తిగా ప్రార్థించాలనే ఆర్ద్రత లేదు
సాధన చేయ సంకల్పించాలనే శ్రద్ధ అసలే లేదు.
ఉన్న అర్హతలల్లా శాస్త్ర దూరపు ఆలోచనలు, సంప్రదాయ విరుద్ధ జీవన విధానం.
ఆ గాఢాంధకారాన్నే మహా జ్ఞానం అని భ్రమించే మా గుడ్డి తనానికి తన ఉనికి వెలుగును దర్శింపచేసిన వారి కృప బరువు ఎంత?
అనుక్షణం అరిషడ్వర్గాల వైపు నడక రాని లేగ దూడలలా పరుగులు తీస్తున్నా గోమాత లా అక్కున చేర్చుకుంటున్న వారి వాత్సల్యపు బరువు ఎంత?
పెను ప్రమాదం అని తెలియక దాని వైపే తప్పటడుగులు వేసే పసి పిల్ల వాడిని వెనక్కి లాగే తల్లిలా కలి దోషాలు నుంచి దూరంగా లాగి ఉద్దరిస్తున్న వారి ప్రేమ బరువు ఎంత?
నిరంతరం వారి శ్వాసను ఫణంగా పెట్టి చేస్తున్న వాక్ యజ్ఞంతో మాలోని దోషాలను తొలగించాలనే వారి అలుపెరుగని కృషి బరువు ఎంత?
నిరంతర అమ్మ ఉపాసనతో తానే ఆ అమ్మకు అభిన్నంగా అయి మమ్ము తమ ఒడిలో సేద తీరుస్తున్న వారి అపార కరుణ బరువు ముందు సింధువు ఒక బిందువే కదా!
అవలీలగా చేజిక్కిన అద్భుతాన్ని సద్వినియోగం చేసుకోవడం తెలియని మా అజ్ఞానాన్ని మన్నించి తన నిర్మల మందస్మితంతో మమ్ము ఆదరించే వారి దయ బరువు ఎంత?......
మాటల్లో చెప్పలేనంత
బహుశా భగవత్ తత్వంలా అవాక్ మానస గోచరమేమో!!!!
No comments:
Post a Comment